కాసనోవా 2020

"విష్ణుమూర్తి వరమా?! అదేమిటి?"

"నీకు తెలీదా? అవున్లే ఈ పట్నపోళ్లకి అసలేం తెలీకుండా పోతుంది. అంతా హేతువాదోద్యమం కదా!! - సరే చెప్తాను విను.

ఓ రోజు భూమ్మీద ఆడోళ్ల కష్టాలు చూసి చలించిపొయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఓ వరం అడిగిందంట, దానివల్ల మగోళ్లంతా ఆడోళ్ల గురించి అనుకున్నయన్నీ మగోళ్ల మొహాల్లో కన్పించసాగాయి. చిత్రంగా అబ్బాయిలకి మాత్రం అట్టాంటివేమీ కన్పించలేదు. అట్నే పక్కనున్న వేరేవాళ్లకి కూడా ఏం కన్పించలేదు, ఆ అమ్మాయికే కన్పిస్తాయంటా!!

------------------------------------------------------------

భాగ్యనగరం తూర్పు కొన - 'సౌభాగ్య విల్లాస్' ప్రాంతంలో ఓ ఇల్లు. అక్కడ ఉన్న అన్ని విల్లాలూ బయటకి ఒకేరకంగా కన్పిస్తాయి, కానీ లోపల దేని ప్రత్యేకత దానిదే! ఆ సౌభాగ్య విల్లాస్ విశాలమైన రోడ్లపై ఓ లేటెస్ట్ అటామిక్ పవర్డ్ కారు హుందాగా ప్రయాణిస్తూ ఓ ఇంటి ముందు ఆగింది. "AZ532 విల్లాకి వచ్చేశాం" అని నాలుగుసార్లు కారు నాజూగ్గా మాట్లాడాక దానిలోనుండి నలుగురు బయటకి వచ్చారు. ఆ నలుగురూ ఎదురుగా ఉన్న ఇంటివైపు నెమ్మదిగా నడుస్తూ, వాళ్లాలో వాళ్లు మాట్లాడుకుంటూ, నవ్వుతూ, గేట్ దగ్గరకి వెళ్లి కాలింగ్ బటన్ కి తమ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చి లోపలికి వెళ్లి లాన్ లోని కుర్చీల్లో కూర్చున్నారు. కూర్చొని మబ్బులు పట్టిన ఆకాశం వంకా, ఇంకా తెరచుకోని విల్లా తలుపుల వంకా, విసుగ్గా చూడసాగారు. ఇంతలో టప టప మని పెద్ద పెద్ద చినుకులు పడసాగాయి.

నాలుగయిదు చినుకులు భూమిని చేరగానే వీళ్లు కూర్చున్న ప్రదేశం మొత్తం గ్లాస్ తో ఆటోమేటిగ్గా కవరయింది. నలుగురి మధ్యలో టీపాయ్ పై వేడివేడి టీ నాలుక్కప్పుల్లో ప్రత్యక్ష్యం అయింది.

నలుగురూ టీ త్రాగుతూ అసహసనంగా విల్లా గేట్ వైపు చూడసాగారు. వర్షం పెద్దదయి వీళ్ల చుట్టూ ఉన్న గ్లాస్ పై నీటి ప్రవాహం ఎక్కువయి బయటంతా మసగ్గా కన్పడసాగింది. ఇంకా కొంచెం చీకటిగా వాతావరణం మారగానే గ్లాస్ కవరింగ్ లోపల ఆటోమేటిగ్గా లైట్ లు వెలిగాయి!

---- *** ----

వీళ్లిలా టీ త్రాగుతూ అసహనంగా విల్లా గేట్ వైపు ఎదురుచూస్తుంటే ఆ విల్లా లోపల 'సువీర్' ప్రపంచాన్నంతా మర్చిపొయి నిద్రపోసాగాడు. ఆ విల్లా కూడా మిగిల్న అన్ని విల్లాల్లాగనే బయటకి ఓ డూప్లెక్స్ హౌస్ లా కన్పించినా, లోపల మాత్రం దానికో ప్రత్యేకత ఉంది! బయటకి కన్పించే రెండు అంతస్తులే కాకుండా లోపల మరో రెండు అంతస్తులున్నాయి!!

అలా -2లోని తన బెడ్రూంలో నిద్రపోతున్న 'సువీర్' అలారం చప్పిడికి కూడా లెగకుండా "ఫ్రీజ్" అని మళ్లా దుప్పటి నిండా కప్పుకొని కాళ్లు ముడుచుకొని చెయ్యి తలక్రింద పెట్టుకొని నిద్ర కొనసాగించాడు.

సరిగ్గా ఒక్క నిమిషం తర్వాత మళ్లా అలారం మోగసాగింది. ఈ సారి అలారంతో పాటు దుప్పటి కూడా మొహంపై వర్షం జల్లులా నీళ్లు విసిరింది. దాంతో 'సువీర్'కి నిద్ర ఎగిరిపొయి కోపం ముంచుకొచ్చింది. కానీ, అంతలో రాత్రి తనే హై ప్రయారిటీ అలారం సెట్ చేశానని గుర్తొచ్చి లేచి టకటకా తయారయి గోడపై చూస్తే అప్పటికే వచ్చి ఎదురుచూస్తున్న ఆ నలుగురూ కన్పించారు.

"షిట్" అనుకుంటూ బయటకి వేగంగా వస్తుంటే స్క్రీన్ పై 'ఎర్ర గొర్రె పిల్ల' ప్రత్యక్ష్యం అయింది. ఆశ్చర్యంగా దానివైపే చూస్తూ బయటకి దారి తీశాడు.

---- *** ----

బయట ఆ నలుగురూ టీ త్రాగడం అయిపోజేసి కప్పులు టీపాయ్ పై పెట్టి మరోసారి అత్యంత అసహనంగా విల్లా వైపు చూశారు.

అప్పుడు గేట్ తెరవబడి 'సువీర్' బయటకొచ్చాడు. అతనితోపాటు వర్షంకి అడ్డుపడుతూ గ్లాస్ కవరింగ్ కూడా రాసాగింది. కరక్టుగా వీళ్లున్న గ్లాస్ హౌజ్ లోకొచ్చి నవ్వుతూ విష్ చేశాడు.

"యూ ఆర్ లేట్!" కంప్లయింట్ చేస్తూ అన్నాడు - అందరిలోకీ ఎత్తుగా ఉన్నతను.

"సారీ! శనివారం కదా!! " అంటూ తన చేతిలోని ప్యాకెట్ అందించాడు.

మరింకేం మాట్లాడకుండా ప్యాకట్ తీసుకొని చేతిలోని సూట్ కేస్ 'సువీర్'వైపు జరిపి "నువ్వు అడిగినట్టే మొత్తం హార్డ్ క్యాష్!"

సంతృప్తిగా తలాడించి, పనయిందన్నట్టు వెనుదిరగబొయ్యాడు. కానీ, అందరికంటే పొట్టిగా ఉన్నతను "శనివారమే కదా! నువ్ కూడా మాతో రారాదు" అనేసరికి "నో" అని జావాబియ్యబోయి పొట్టోడి తెల్లరంగు టోపీపై ఉన్న 'ఎర్ర గొర్రె పిల్ల' బొమ్మ చూసి "సరే" అన్నాడు. మిగిల్న ముగ్గురూ పొట్టివాడివైపోరకంగా చూశారు.

పక్క విల్లాలోనుండి అత్యాధునిక బైనాక్యులర్స్ తో ఈ ఐదుగుర్నీ గమనిస్తున్న ఒక జత కళ్ల గురించి వీరెవరికీ తెలీదు.

---- *** ----

'చింతర్గా' కారులో ఆ నలుగురి కారు 'సువీర్' వర్షంలో సౌభాగ్య నగరం అందాలు చూస్తూ ఫాలో అవ్వసాగాడు. ఇంతలో ఓ రెస్టారెంట్ పై 'ఎర్ర గొర్రె పిల్ల ' బొమ్మ చూసి ఆగిపొయ్యాడు.

ఆ నలుగుర్నీ ఫాలో అవ్వడం ఆపేసి 'చింతర్గా'ని ఆ రెస్టారెంట్ కి పొమ్మని ఆదేశించి అదే విషయాన్ని ముందున్న వాళ్లకి సమాచరించాడు.

రెస్టారెంట్ లోపలికెళ్లి ఖాళీ టేబుల్ కోసం చూస్తుంటే ఓ దృష్యం 'సువీర్'ని ఆకర్షించింది.

ఒకమ్మాయి ఎదురుగా ఉన్న అబ్బాయి చెంపపై గట్టిగా ఒక్కటిచ్చి "ఈ రోజుల్లో నువ్వు అమ్మాయిల్ని మోసం చెయ్యలేవు. గెటవుట్" అని అందరూ వినేట్టుగానే అరచి మరీ చెప్పింది.

అందరూ ఒక్క క్షణం అటువైపు చూసి ఎవరి భావాల్ని వాళ్లు రకరకాల ఎక్స్ ప్రెషన్లుగా ఇచ్చి తరువాత వారి వారి లైఫ్ లో పడిపొయ్యారు.

అసలీ గొడవలన్నీ రెండేళ్లనుండి మొదలయ్యాయి. సాఫీగా సాగిపోతున్న ప్రపంచగమనం పెద్ద కుదుపుకులోనయింది. అకస్మాత్తుగా అమ్మాయిలకు అబ్బాయిల ఫేస్ రీడింగ్ అలవాటయిపొయింది. అదీ అచ్చు తప్పుల్లేకుండా!! ఎదుట ఉన్న అబ్బాయి తమ గురించి ఏమనుకుంటున్నాడనేది అమ్మాయికి ఇట్టే తెలిసిపోసాగింది. దాంతో ప్రపంచ గమనం తారుమారయింది. ఇప్పుడు జరిగిన ఆ సంఘటన కూడా ఆ బాపతే అనుకుంటా అని ఆలోచిస్తూ 'సువీర్' అప్రయత్నంగానే ఆ అమ్మాయి టేబుల్ వైపు అడుగులు వేశాడు.

ఆ అమ్మాయినే పరిశీలనగా చూడసాగాడు. టేబుల్ పై క్యాన్ గట్టిగా పట్టుకొని నెమ్మదిగా తాగుతూ కళ్లతో తీక్షణంగా టేబుల్ కవర్ పై ఉన్న మందారం డిజైన్ చూస్తూ ఏదో ఆలోచించసాగింది. 'సువీర్' మరింత పరిక్షగా చూస్తే క్యాన్ పట్టుకున్న ఆమె చెయ్యి వణకసాగింది. వయసు 18-20 మధ్య ఉండొచ్చు.

"హాయ్" అంటూ సువీర్ పలకరించేసరికి ఒక్కసారిగా ఈ లోకంలోకొచ్చి పై పళ్లతో పెదాలు కొరుక్కోడం ఆపి ఆశ్చర్యంగా 'సువీర్'వైపు చూసింది. బయటకు రాబోయిన నీళ్లు కళ్లలోనే ఆగిపోవడాన్ని 'సువీర్' అకస్మాత్తుగా పలకరించడంతో అతన్నుండి దాచలేకపొయింది.

"మీ రింగ్.." అంటూ డైమండ్ రింగ్ తీసి ఆమెకిచ్చాడు.

"ఓ ! థాంక్స్. చూళ్లేదు. క్రింద పడ్డట్టుంది." అంటూ దాన్ని తీసుకొని ఎడమచేతి వేలికి అలంకరించింది.

"నేనిక్కడ కూర్చోవచ్చా?" అంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు.

"తప్పకుండా" అంటూ ఓ క్యాజువల్ నవ్వు నవ్వింది. అప్పటికే తన్ను తాను పూర్తిగా కంట్రోల్ లోకి తెచ్చుకుంది.
**********

"మీ పేరు?" అంటూ 'సువీర్' ప్రశ్నించగానే ఆమె అతని కళ్లలోకి చూసింది. తరువాత అతని నుదురు చూసి మరింత ఆశ్చర్యపొయి సర్దుకొని కూర్చొని జుట్టు వెనక్కనుకొని మరోసారి పలకరింపు నవ్వు నవ్వి "అసిత" అంటూ బదులిచ్చింది.

"వావ్! సూటబుల్ నేం!!" అని 'సువీర్' బదులిస్తే అసిత అర్థం కానట్లు చూసింది.

మళ్లా సువీరే మాట్లాడసాగాడు. "అసిత" అంటే అర్థం తెలుసా?"

తెలీదన్నట్లు తలాడించింది.

"చెప్పాక మళ్లా నన్ను కొట్టకూడదు!" అంటూ చెంప పట్టుకొని చిన్న పిల్లోడిలా భయపడుతున్నట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చి కుర్చీలో కొంచెం వెనక్కి జరిగాడు.

ఈ సారి అసిత గలగలా నవ్వుతూ "సరే ఏం అననులే చెప్పు" అంటూ కొంచెం ముందుకు జరిగింది.

నవ్వుతున్న ఆమె మొహం చూస్తూ బ్యూటిఫుల్ అని మనస్పూర్తిగా అనుకుంటూ సువీర్ కూడా కొంచెం ముందుకు జరిగాడు.

అతని మొహంవైపు చూస్తున్న అసితకి ఆ విషయం అర్థం అయి మరింత ఆసక్తిగా చూడసాగింది.

"అసిత అంటే నల్లమ్మాయ్ అని అర్థం"

"అవునా! నేనెప్పుడూ ఆలోచించలేదు"

"అవును కానీ మీపేరు అసిత సుందరి అని పెట్టాల్సింది"
"చీ! మరీ మోటుగా ఉంది."
"కానీ నువ్ నిజంగా సూపర్ గా ఉన్నావ్" అంటూ సువీర్ అసితను మరింతగా పరిశీలించసాగాడు.
అసిత అపనమ్మకంగా సువీర్ మొహంవైపు పరిశీలనగా చూడసాగింది.

**********

వాళ్లిద్దరి తొలి పరిచయమే చాలా మెమరబుల్ గా మారింది. ఇద్దరూ కలసి అదే రెస్టారెంట్ లో లంచ్ పూర్తి చేశారు.

"మళ్లా ఎప్పుడు కలవడం" అసిత చెయ్యి పట్టుకొని లాలనగా అడిగాడు.

"తెలీదు"
"అదేంటి?"
"ఇంకో రెండు గంటల్లో నేను అండమాన్లో ఉంటాను. మా నాన్నగారక్కడ వాతావరణశాఖలో పన్జేస్తున్నారు."

"రేపు వెళ్లొచ్చు కదా!"

"లేదు, వెళ్లాలి."

సువీర్ మొహంలో విషాదం దాద్దామన్నా దాగలేదు. అసిత అతని బుగ్గపై ముద్దు పెట్టి చెయ్యి పట్టుకొని "మళ్లా భాగ్యనగరం నీ కోసమే వస్తాగా ప్రామీస్!!" అని బై చెప్పింది.

అసిత విమానం ఎక్కినతర్వాత మనసు రెండు భాగాలుగా విడిపొయి ఆ రోజు జరిగిన రెండు విషయాల గురించి ఆలోచించసాగింది. కానీ, తొందరగానే మనసంగా 'సువీర్' ఆక్రమించాడు. మళ్లా విమానం వెనక్కి వెళ్తే బాగుండు అనుకోసాగింది. కానీ తన ఆలోచనల్తో ప్రమేయం లేకుండానే విమానం అండమాన్లో ల్యాండయింది.

విమానం దిగి బయటకి వెళ్లిన అసిత తన కళ్లను తానే నమ్మలేకపొయింది. సువీర్ తన కోసం ఎదురు చూడసాగాడు. అంతే అసిత వేగంగా వెళ్లి, పరిసరాల్ని మర్చిపొయి కౌగిలించుకొని తన్ను తాను మర్చిపొయింది.

**********

వారం రోజులు ఎలా గడిచిపొయ్యాయో తెలీలేదు. అసిత జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడూ అనుభవించలేదు.

ప్రతిక్షణానికీ తనపై సువీర్ ఆరాధన రెట్టింపవుతుంటే అతని ఫేస్ రీడింగ్ తో తెలుసుకొని అతనే తనకోసం జన్మించిందని డిసైడైంది.

వారం రోజుల తర్వాత 'సువీర్'తో అతని హెలీకాప్టర్ లో అండమాన్ అడవుల అందాలను ఎంజాయ్ చేస్తూ మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చింది.

---- *** ----

విమానం మరో గంటలో ఫ్లోరిడాలో ల్యాండవుతుంది. అప్పుడే నిద్రాలోకం నుండి ఈ లోకంలోకి వస్తూ సువీర్ ఆలోచనలు అంతకుముందు రోజు ఆఫీస్ లో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకోసాగాయి. అసలీ ఫ్లోరిడా అసైన్ మెంట్ బ్రహ్మీ - ది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అటెండ్ అవ్వవలసింది, కానీ లాస్ట్ మినిట్ లో ఏం జరిగిందో తెలీదు కానీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. పెళ్లం జగన్మోహిని కొడితే తలపగిలిందని రూమర్లు. నిజనిజాలు ఆ పెరుమాలకే తెలియాలి. అలా అకస్మాత్తుగా ఫ్లోరిడా ప్రయాణమవ్వాల్సివచ్చింది.

**********

అస్సలు ప్రిపేర్డ్ గా రాకపోడంతో క్లయింట్ చావదొబ్బాడు. చావు తప్పి కన్ను లొట్టపొయినట్టు ప్రాజెక్ట్ ఓకే చేసుకొని కొంచెం రిలాక్స్ అవుదామని బీచ్ కెళ్లి అలల్లో కూర్చున్నాడు.

**********

"గార్గియస్"
అసంకల్పితంగానే 'సువీర్' నోట్లో నుండి వెలుపలకొచ్చిన మాట.

"స్టన్నింగ్"
మరోసారి ఆశ్చర్యపోతూ తన ఎదురుగా సర్ఫింగ్ చేస్తున్న మెరుపు తీగను చూస్తూ నోరెళ్లబెట్టాడు.

"హే!"
"వాట్?"
"ఇండియన్?"
"అవును, ఎలా చెప్పావ్?"
"నీ చెవులకున్న బుట్టలు చూసి" అంటూ సువీర్ ఆమె బుట్టలు పట్టుకొని మరీ చెప్పేసరికి ఆ కళ్లలో నిప్పులు ప్రత్యక్ష్యం అయ్యాయి. కానీ, ఇంతలో సువీర్ కళ్లలోకీ, తర్వాత అతని నుదురు చూసి ఆశ్చర్యంతో ఆగిపొయింది.

"మెరుపు తీగా! నీ పేరేంటో?"
"ధాత్రి - ఇంతకీ నీ పేరేంటో?"

"సువీర్ - భాగ్య నగరం"

"ఓ!" అంటూ బయల్దేరింది.

"మళ్లా ఎప్పుడు కలుద్దాం?"
"ఎందుకు?"
"నువ్వు ఇంట్రెస్టింగా ఉన్నావ్!"

"నన్ను కలవాలంటే సండే అక్కడ వెయిట్ చెయ్యి" అంటూ సముద్రంలో ఎగసిపడుతున్న అల వైపు చూపించింది.

--- సండే అదే సమయంలో ---

'సువీర్'ని అలా అలలపై సర్ఫింగ్ చేస్తుంటె చూసి 'ధాత్రి' అమితాశ్చర్యానందాలకు గురయింది. ఇద్దరూ పోటాపోటీగా సర్ఫింగ్ చేస్తూ అప్పుడే సువీర్ ఇచ్చిన మైక్రో ఫోన్లలో సముద్రపు హోరుకు మించి మాట్లాడుకోసాగారు.

"సౌభాగ్యనగరం వారికి సముద్రం లేకున్నా సర్ఫింగ్ వచ్చా?" చేతులు రెండూ లయగా కదుపుతూ బాలన్స్ డ్ గా అలలపై అలవోకగా ప్రయాణిస్తూ 'సువీర్'వైపు చూస్తూ అడిగింది.

"మెరుపు తీగ అడిగితే సముద్రపు అలలపై ఏం మాట చంద్రుడి అంచుపై అయినా వెయిట్ చేసేవాణ్ని" అంటూ సువీర్ ఆమెను ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లాడు.

అతని మొహంలో చూసి ఫేస్ రీడింగ్ చెయ్యడం ధాత్రి వీలవలేదు. దాంతో ఓ నిర్ణయానికొచ్చి సర్ఫింగ్ మానేసి బీచ్ రెస్టారెంట్కి తీసుకెళ్లింది. అక్కడ వాళ్లిద్దరూ ఆరు గంటలు పైబడి జీవితంలో ముచ్చట్లను పంచుకున్నారు. అప్పటికే ధాత్రి ఓ నిర్ణయానికొచ్చింది. తను ఇంతకాలం ఎదురు చూసిన వ్యక్తి 'సువీర్' అని అనుకుంది.
**********

వాళ్లిద్దరూ తరువాత వారం రోజులూ ఒక్కటిగా తిరిగారు. అలల్లో ఊయలలూగుతూ ప్రకృతిలో ప్రకృతిలా మారిపొయ్యారు.

తరువాత రోజు సండే సాయంత్రం మూడుగంటల సర్ఫింగ్ తర్వాత ఇద్దరూ సముద్రం ఒడ్డున నడవసాగారు.

"నువ్వు నన్ను గెల్చావురా!" అంటూ ధాత్రి సువీర్ నడుం చుట్టూ చెయ్యివేసి ముద్దు పెట్టుకుంది.

సువీర్ కి ఇంకా అలల్లో సర్ఫింగ్ చేస్తున్నట్లే ఉంది.
"అవును, బాగా ప్రాక్టీస్ చేశా" అంటూ ముద్దు కంటిన్యూ చేశాడు.

"అబ్బా! సర్ఫింగ్ లో కాదురా!!"

"మరీ?!" ఆశ్చర్యంగా ధాత్రివైపు చూశాడు.
"నేను ఓడిపోయానురా!"
"అంటే?!" ఈ సారి మరింత ఆశ్చర్యపొయ్యాడు.
"మొద్దూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానురా!" అంటూ 'సువీర్'ని ఈ సారి కౌగిలించుకొని ముద్దుల్తో ముంచెత్తింది.

**********

"నైన్ ఓ క్లాక్ - నా అపార్ట్ మెంట్ కి రారా! ఐ వాంట్ టూ సెలబ్రేట్ టుడే!!" అంటూ ధాత్రి సువీర్ బుగ్గపై ముద్దు పెట్టి బైక్ తొక్కుతూ వెళ్లిపొయింది.

---- **** ----

'అణ్వంతర్గామి మ్యూజియం - విశాఖపట్టణం'

సువీర్, మ్యూజియంలోకి వచ్చినప్పట్నుండి ఆ వాగుడుకాయను గమనిస్తూనే ఉన్నాడు. ఒక్క క్షణం కూడా ఆమె నోరు ఖాళీగా లేదు. పక్కనున్న ఆమె తమ్ముడు ఎలా భరిస్తున్నాడో ఏమో అనుకోసాగాడు.

"అసలీ మ్యూజియంని అణ్వంతర్గామి మ్యూజియం అని ఎందుకంటారో తెల్సా?"

"తెల్సక్కా! మన దేశం మొదట స్వంతంగా తయారు చేసుకున్న అణు జలాంతర్గామిలో ఏర్పాటు చేసిన మ్యూజియం కాబట్టి ఆ పేరు పెట్టారు, కదక్కా!" అంటూ వాళ్లక్కవైపు ఉత్సాహంగా చూశాడు.

"కరక్ట్! కాకపోతే మొదట్లో దీన్ని అటామిక్ సబ్ మెరైన్ మ్యూజియం అనేవాళ్లు, అప్పట్లో ఇది వాడుకలోనే ఉండేది, కానీ నెలకోరోజు మాత్రం ఇందులో మ్యూజియం పెట్టేవాళ్లు తరువాత రోజుల్లో మామూలు సబ్ మెరైన్ లో పెట్టేవాళ్లు. తర్వాత 2010లో తెలుగు ఆత్మగౌరవోద్యమంలో అణ్వంతర్గామి మ్యూజియంగా మార్చారు"
"నీకు చాలా తెలుసక్కా! " అంటూ తమ్ముడు నోరెళ్లబెట్టడాన్ని చూసి 'సువీర్' కొంచెం గట్టిగానే నవ్వాడు.

అక్కా తమ్ముళ్లిద్దరూ వెనక్కి తిరగడం చూసి వేగంగా ముందుకు వెళ్లి బూటు తాడు కట్టుకోడానికి వంగి పక్కనుండి వెళ్తున్న ఆ అమ్మాయి కాలి వెండి పట్టీ పట్టుకొని చూశాడు.

ఏదో అనుమానం వచ్చి ఆ అమ్మాయి కాలి పట్టి చూసుకుంది, ఏం తేడాలేకపోవడంతో మ్యూజియం మిగతా భాగం చూట్టానికి ముందుకు వెళ్లింది.

**********

సువీర్ రకరకాలుగా ప్రయత్నించాడు - ఆ అమ్మాయి దృష్టినాకర్షించడానికి. కానీ అసలు పట్టించుకోలేదు. సువీర్ కేం అర్థం కాలేదు. తరువాత చూస్తే ఆమె ఎడమ కాలి పట్టీ ఎప్పుడు ఎక్కడ పోయిందో కాని కేవలం కుడికాలికే పట్టీ ఉంది.

**********

మ్యూజియం బయట పచ్చబొట్టు రంగు వేయించుకుంటున్న అక్కా తమ్ముళ్ల దగ్గరకి వెళ్లి అప్పుడే వేసిన ఆ అమ్మాయి భుజంపైనున్న మందారం పువ్వు డిజైన్ పట్టుకున్నాడు.
"ఓయ్! ఏం చేస్తున్నావ్?"

"ఏం లేదు మందారాన్ని తాకి చూస్తున్నా" అంటూ బదులిచ్చిన 'సువీర్'ని ఏదో అనబోయింది. కానీ, ఆ అమ్మాయికి ఆశ్చర్యంగా నోరుమూసుకపొయింది. కోపం కూడా రాలేదు. అతని కళ్లలోకి ఆశ్చర్యంగా చూడసాగింది. ఆ తర్వాత అతని నుదురు వైపు చూసి మరింత ఆశ్చర్యపొయింది.

**********

చంపా!!

కొత్త ద్వీపాలు!!!

వైజాక్ నుండి ఎలాగో కష్టపడి ఓ చేపల బోట్ సంపాదించి బయల్దేరాడు. అసలీ ద్వీపాల చరిత్రే వింతగా ఉంటుంది. 2015లో బంగ్లాఖాతంలో పేలిన అగ్ని పర్వతాలతో ఏర్పడ్డ ద్వీపాలు. రెండు సంవత్సరాలు బంగ్లాదేశ్, భారత దేశం నాదంటే నాదని వాదించుకున్నాయి. 2017 ఆఖర్లో చిన్నపాటి యుద్దమే జరిగి భారత ఆదీనంలోకి వచ్చాయి. కానీ అంతలోనే అది కాస్తా హైటెక్ సముద్రపు దొంగల స్థావరంగా మారిపొయింది. దాంతో గత సంవత్సరం నుండి ఆ ద్వీపాన్ని హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు. ఇంకా నో ఫ్లయింగ్ జోన్ గా కూడా ప్రకటించారు. అక్కడ ఎగిరే ఎంత చిన్న విమాన్నయినా కూల్చేసే అధికారాలు ఇచ్చరు. అటువంటి ద్వీపంలో చంపా వాళ్ల నాన్న సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాడు.

**********

జీవితంలో ప్రయాణాలన్నీ అనుకున్నట్టే జరిగితే అది జీవితం కాదు కదా! అలాగే కొత్త ద్వీపాలకు బయల్దేరిన సువీర్ వాళ్ల పడవ కాస్తా సముద్రపు దొంగల పాలయింది. మొత్తం పదిమందినీ బందించి రకరకాల పనులు ఉదయం నుండి సాయంత్రం వరకూ చేయించసాగారు. తప్పించుకోడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుందాం అని సువీర్ ఎదురు చూడసాగాడు. చివరకు ఆ అవకాశం కాస్తా ఆ రోజు సాయంత్రం వచ్చి తలుపు తట్టింది.

ఎండు రోట్టెలు , చేపల కూర తింటూ అంతకు ముందు సముద్రపు దొంగలకు దొరక్కుండా తన దుస్తుల్లో దాచుకున్న కాస్ట్లీ సిగరెట్లు ఇస్తూ పరిచయం పెంచుకున్న వంటవాడితో మాట్లాడసాగాడు.

"అయితే మీ నాయకుడికీ, అతని భార్యకూ పడట్లేదంటావ్?" చేప ముల్లుని అమృతంలా జుర్రుకొని అవతలపడేస్తూ అడిగాడు.

"అదే కదా నేను చెప్పేది - ఇందాకట్నుండీ"

"ఏప్పట్నుండి - ఆ గొడవలు?"

"మొదట్లో బాగానే ఉండేవాళ్లు. కానీ రెండు సంవత్సరాల ముందు ఆ విష్ణుమూర్తి వరం ఇచ్చిన దగ్గర్నుండి ఆయన మొహమే చూడటం మానేసింది!"

"విష్ణుమూర్తి వరమా?! అదేమిటి?"

"నీకు తెలీదా? అవున్లే ఈ పట్నపోళ్లకి అసలేం తెలీకుండా పోతుంది. అంతా హేతువాదోద్యమం కదా!! - సరే చెప్తాను విను.

ఓ రోజు భూమ్మీద ఆడోళ్ల కష్టాలు చూసి చలించిపొయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఓ వరం అడిగిందంట, దానివల్ల మగోళ్లంతా ఆడోళ్ల గురించి అనుకున్నయన్నీ మగోళ్ల మొహాల్లో కన్పించసాగాయి. చిత్రంగా అబ్బాయిలకి మాత్రం అట్టాంటివేమీ కన్పించలేదు. అట్నే పక్కనున్న వేరేవాళ్లకి కూడా ఏం కన్పించలేదు, ఆ అమ్మాయికే కన్పిస్తాయంటా!!

అప్పట్నుండి మొదలయ్యాయి మా నాయకుడి కష్టాలు...."

ఇదంతా వింటుంటే 'సువీర్' అమన్సులో ఓ పథకం రూపొందసాగింది.

**********

"ఏమిటి ఏదో మాట్లాడాలన్నవంట?"

భారీ కాయంతో, పెద్ద పెద్ద మీసాల్తో ఎదురుగా కుర్చీలో కూర్చొని కోపంగా చూస్తున్న దొంగల నాయకుణ్ని చూసి వచ్చిన పని ఒక్క క్షణం మర్చిపొయ్యాడు.

"ఏంటి మాటల్రావా?" మరోసారి గద్దించేసరికి ఈ లోకంలోకొచ్చాడు.

"నా దగ్గరో చిట్కాఉందండీ, అది ప్రయోగిస్తే మళ్లా మీ ఆవిడ మీరు చెప్పినట్టు వింటుందండీ"

"ఏంట్రా ? నగరమోళ్లు కూడా అంత్రాలూ మంత్రాలూ నేర్చుకుంటున్నారా?"

"ఏదో మీ దయ"

"సర్లే ఏం చెయ్యాలో చెప్పు?"

"అయ్యా! చిట్కా పన్జేస్తే నన్నొదిలెయ్యాలి."

"చూద్దాంలేగాని ముందు పని చూడు."

"అయ్యా!"

"చూద్దామన్నా కదా! ముందు పనయ్యేట్టు చూడు."

"నా లగేజీ ఇప్పించండయ్యా! అన్నీ దాంట్లోనే ఉన్నాయి."

"ఏం కిరికిరి లేదుగా! - అయినా నా సంగత్తెలుసుగా ఉప్పు పాతరేత్తా, తేడా ఏమన్నా వచ్చిందంటే"

"అయ్యా! - రేప్పొద్దున కల్లా మీకు తెలుస్తుంది కదా!"

**********

ఆ తర్వాత సువీర్ తన సూట్కేస్ తెప్పించుకొని రెండు తాయెత్తులు తయారు చేసి ఒకటేమో దొంగలనాయకునికి మరొకటేమో అతని భార్యకూ ఇచ్చాడు. అదే సమయంలో సువీర్ సూట్ కేస్ అడుగున ఉన్న చిన్న బొడిపె నొక్కడం ఎవరూ గమనించలేదు.

**********

ఆ తరువాత రోజు ఉదయం దొంగల నాయకుడి ముందు సువీర్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు. దొంగల నాయకుడు ఒళ్లు విరుచుకుంటూ "నీ అంత్రం బాగానే పన్జేసిందిరా - ఇంకో నాలుగు తయారు చేసివ్వు!" అని అడగ్గానే సువీర్ ఆశ్చర్యపొయ్యాడు. "అయ్యా ఎందుకయ్యా?" అని అడగటమే ఆలస్యం. దొంగల నాయకుడు పగలబడి నవ్వసాగాడు. అతనితో పాటు అందరూ శృతి కలిపారు.

"యాడ్నుండొచ్చావురా నువ్వు? లోకమ్లో ఇంక ఆడోళ్లే లేరా ఏంది?"

"అయ్యా నన్ను పంపిత్తా అన్నారు."

"చూద్దాం అన్నాగా ఇంకో నాలుగు చెయ్యి అట్నే పపిత్తా"

"అయ్యా! అయి రెండే ఉన్నాయి నా కాడ"

"అరె వీడిట్టా మాటిండుగానీ మన పద్దతిలో అడగండిరా!" అని దొంగలనాయకుడు అనగానే ఇద్దరు అనుచరులు సువీర్ ని ఈడ్చుకుంటూ వెళ్లసాగారు.

అప్పుడు మొదలయిందా అసజడి....

---- *** ----

"సువీర్! నిజంగా నాకోసం అంత రిస్క్ తీసుకొచ్చావా?"

చంప వాళ్ల నాన్న సువీర్ పంపిన సిగ్నల్స్ సహాయంతో దొంగల స్థావరంపై దాడి చేసి అందర్నీ అరెస్ట్ చేసి సువీర్ వాళ్లని రక్షించాడు. ఆ తర్వాత సువీర్ నేరుగా చంపని కల్సుకొని ఆమెని చూట్టం దగ్గర్నుండి తను ఆమె కోసం బయల్దేరిన విశేషాలన్నీ వివరించాడు.

"అవును చంపా! అచ్చంగా నీకోసమే!!" ఈ సారి చంప ఏమీ మాట్లాడలేదు సువీర్ చెయ్యి అలాగే గట్టిగా పట్టుకొని సముద్రం ఒడ్డున నడవసాగింది.

**********

వాళ్లిద్దరూ అలాగే చిలకా గోరింకల్లా కొత్త ద్వీపం ఆ కొన నుండి ఈ కొన వరకూ తిరిగారు. సముద్రంలో చేపలకే అసూయ కలిగేట్టు ఈదులాడారు. గాల్లో పక్షులకే అసూయ కలిగేట్టు చంపా వాళ్ల నాన్న హెలీకాప్టర్లో విహరించారు. అడవిలో హరిణిలకే అసూయ కలిగేట్టు గంతులేస్తూ ఆడుకున్నారు.

వారం రోజుల తర్వాత సముద్రపు ఒడ్డున చంప ఒళ్లో తల పెట్టుకొని అస్తమిస్తున్న సూర్యుణ్నీ, సముద్రాన్నీ చూస్తున్న 'సువీర్'తో చంప అన్నది "సువీర్! మనం పెళ్లి చేసుకుందామా" అని.

---- *** ----

అప్పుడే తన ఇంట్లో -2 లోని బెడ్రూంలోకి అడుగు పెట్టిన సువీర్ నుదురుకు తుపాకి ఆనించి "కదలకు" అని ఓ గొంతు అనేసరికి ఎక్కడలేని ఆశ్ఛర్యం ముంచుకొచ్చింది.

ఇంత సెక్యూర్ ఇంటిలోకి వేరొకరు రావడమా?! - ఇంపాజిబుల్ అని మనసులోనే అనుకున్నాడు. కానీ వాస్తవం కళ్లెదురుగా వేరేరకంగా ఉంది. తలకి గురిపెట్టిన తుపాకే దానికి సాక్ష్యం. ఆ గొంతు ఆడగొంతు అని తెలుస్తూనే ఉంది, కానీ ఎవరో పోల్చుకోలేకపోతున్నాడు.

గట్టిగా చిటిక వేశాడు. తన సెక్యూరిటీ ఎరేంజ్ మెంట్స్ ప్రకారం ఇప్పుడు వెరీ హై బీం లైట్స్ వెలగాలి దానితో శతృవు కళ్లు మూసుకుంటాడు తను తప్పించుకోవచ్చు. కానీ అటువంటి లైట్లేమీ వెలగలేదు.

ఈ సారి తుపాకి నుదుటికి ఇంకొంచెం గట్టిగా తగిలింది. "నీ పప్పులేం ఉడకవుకానీ మర్యాదగా ఆ సోఫాలో కూర్చో! అంటూ అనేసరికి ఇహ తప్పదన్నట్టు కూర్చొని "ప్రొటెక్షన్" అని చిన్నగా అన్నాడు. ఏం జరగలేదు. "బ్యాకప్ ప్రొటెక్షన్" అని ఈ సారి కొంచెం పెద్దగానే అన్నాడు. కానీ ఏం జరగలేదు.

"చెప్పాను కదా! నీ పప్పులేం ఉడకవని! మర్యాదగా కామ్ గా కూర్చుంటావా తుపాక్కి పన్జెప్పమంటావా?"

ఈ సారి సువీర్ ఎటువంటి ప్రయత్నం చెయ్యకుండా వెనక్కి వాలి కూర్చున్నాడు. వచ్చిన వాళ్లు తన్ను చంపటమో, దొంగతనమో అయితే ఈ పాటికి ఏదో ఒకటి జరిగి ఉండేవి, చూద్దాం ఇది ఎంతవరకూ వెళ్తుందో అనుకుంటూ చూడసాగాడు.

"దట్స్ గుడ్ బాయ్" అని ఆ గొంతు మళ్లా "ప్రొజెక్షన్ ఆన్" అనగానే బెడ్రూం గోడపై ప్రొజెక్షన్ స్టార్ట్ అయింది.

"ఇంపాజిబుల్" అప్రయత్నంగానే సువీర్ అనేసరికి ఎదురుగా కూర్చున్న ఆడగొంతు నవ్వి. "బాబూ సువీర్! లోకమ్లో నువ్వొక్కడివే తెలివిగలవాడివి కాదు, లోకంలో నువ్వొక్కడివే హ్యాకర్ వి కాదు" అని తర్వాత ఆ ప్రొజెక్షన్వైపు చూడసాగింది.

ప్రొజెక్షన్ పై ముందు చంప ఫోటో ప్రత్యక్ష్యం అయింది. ఎక్కడ మొదలయి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక సువీర్ తన్ను తాను కంట్రోల్ చేసుకొసాగాడు.

ఒక్కో ఫోటో రాగానే ఆ ఆడగొంతు ఆ ఫోటోలో వ్యక్తి పేరు చెప్పసాగింది.

"చంప"
"ధాత్రి"
"అసిత"
"లీతు"
"కవిజ"
"ఇట్మి"
"తన్వి"
"రేణు"
"రాజీ"
"సంపంగి"
"ఎమ్మి"
"వసు"

ప్రొజెక్షన్ వసు ఫోటో దగ్గర ఆగిపొయింది.

"మిస్టర్ సువీర్! వీళ్లందర్నీ ఎప్పుడన్నా చూసినట్లు గుర్తుందా?"

సువీర్ ఏం మాట్లాడలేదు. అతని మెదడంతా బ్లాంకయిపొయింది. జరుగుతున్న దాన్ని స్వీకరించడం మానేసింది.

"మిస్టర్ కాసనోవా!" ఆ మాట వినగానే చివ్వున తలెత్తి ముసుగుపైన ఉన్న ఆమె కళ్లలోకి చూశాడు.

అప్పుడు ఆమె ముసుగు తొలగించింది.

"నువ్వా! రాధా!!"

"అవును. నేనే - చూడు మిస్టర్ కాసనోవా! ఒక్కసారి ఒక్కర్ని మోసం చెయ్యవచ్చు, కొన్ని సార్లు కొందర్ని మోసం చెయ్యవచ్చు. కానీ అందర్నీ అన్నిసార్లూ మోసం చెయ్యలేవు! - నీ విషయం పోలీసులకి చెప్తే ఏం జరుగుతుందో తెలుసా?"

సువీర్ ఏం మాట్లాడలేదు.

రాధనే మళ్లా మాట్లాడింది. "ప్రొజెక్షన్ - నెక్స్ట్" అన్నది, దానితో గోడమీద బొమ్మ మారిపొయింది. ఆ బొమ్మ చూడగానే సువీర్ మొహంలో భావాలు మారిపొయ్యాయి. "నీకు సమీర కూడా తెలుసా?" అంటూ ఆశ్చర్యంతో రాధని ప్రశ్నించాడు.

"మేము మీ ఇంటి పక్కకొచ్చి ఎన్ని సంవత్సరాలయింది?"

"ఐదేండ్లు"

"ఐదేండ్లనుండి నిన్ను ప్రేమిస్తున్న నాకు నీగురించి వివరాలన్నీ తెలీకుండా ఉంటాయా?"

సువీర్ ఏం మాట్లాడలేదు. సమీర బొమ్మనే చూడసాగాడు. మళ్లా రాధనే మాట్లాడసాగింది. "చూడు మిస్టర్ కాసనోవా! ఎప్పుడో ఎవరో అమ్మాయి నీ ప్రేమను ఒప్పుకోలేదని ఇలా నీ తెలివితేటల్తో మాయ చిప్ డవలప్ చేసి నీ మనసునీ, ఫేస్ రీడింగ్ నీ ఫేక్ చేసి అమ్మాయిల హృదయపు లోతుల్లోకి వెళ్లి అక్కడ్నుండి బెడ్రూం అంచువరకూ వెళ్లి మాయమైపోవడం!!!

ఎంత అందమైన పనిష్మెంట్!

ఎంద దారుణమైన ప్రతీకారం!!"

సువీర్ ఇప్పుడిప్పుడే ఈ లోకంలోకి రాసాగాడు. కానీ ఇంకా అలాగే సైలెంట్ గా రాధ చెప్పే మాటలు వినసాగాడు.

"కాసనోవా! అన్ని కష్టాలు పడ్తావ్! ఒక్క రోజన్నా సంతోషంగా ఉన్నావా? ఒక్కొక్క అమ్మాయిని పడేటానికి ఎంత కష్టపడ్డావ్! మూడు రోజులు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేశావ్, ఆఫ్రికా ఎడారుల్లో తిరిగావ్, రెండ్రోజుల్లో సర్ఫింగ్ నేర్చుకున్నావ్, సముద్రపు దొంగలకి ఊడిగం చేశావ్, అకస్మాత్తుగా అండమాన్లో ప్రత్యక్ష్యం అవుతావ్!! - ఒకటా రెండా ఎన్ని సాహసాలు చేశావ్ కానీ కొంచెం అన్నా సంతోషంగా ఉన్నావా? నీన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే హృదయం నీకు నాలుగడుల దూరంలోనే ఉన్నా తెలుసుకోలేదు! "

అప్పటికి కొంచెం ఈ లోకంలోకి వచ్చి సువీర్ అడిగాడు "నీకు ఏం కావాలి?"
"నీ ప్రేమ కావాలి. నీ నిజమైన ప్రేమ కావాలి."
"నువ్వు తట్టుకోలేవేమో?"
"నువ్వు నా ప్రేమను తట్టుకోగలవా?" రాధ ఎదురు ప్రశ్నించింది.
"చూద్దామా?"
"చూద్దామా?"

"మరో మాట - ఈ సారి కానీ ఈ కాసనోవా వేషాలువేసినట్టు నా నెట్వర్కుకి తెల్సిందంటే ఆ తుపాకిలోబుల్లెట్లు లోడ్ చేసుకొని మరీ నీ సెక్యూరిటీ జోన్లోకి హ్యాక్ చేస్తాను, బీ కేర్ ఫుల్!!"

---- **** ----

కథ కంచికీ మనమింటికీ...

అవార్డుకి ఎంత దూరంలో ఉన్నానంటారు బ్లాగ్ పాఠకులారా?